కాంగ్రెస్‌కు ఓటడిగే హక్కు లేదు
కాకతీయ, చేర్యాల: ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని చేర్యాల 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీపీ మెడిశెట్టి ఉమా-శ్రీధర్ అన్నారు. 10వ వార్డులో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, గత పదేళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఎంతో కృషి చేసిందన్నారు. ప్రజలను మభ్యపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పథకాలను అటకెక్కించిందన్నారు. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చేర్యాల మున్సిపల్ పీఠం బహుమానంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.


