చదువుల్లో రాణిస్తే నగదు బహుమతి
విద్యతోనే సమాజంలో మార్పు
ప్రతిభకు మరింత పదునుపెట్టండి
జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి
మిషన్ పదవ తరగతి పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మిషన్ పదవ తరగతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి శనివారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీఈవో నాగలక్ష్మి మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన “మిషన్ పదవ తరగతి” కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. చదువుతోనే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. జిల్లాలోని 111 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.2.2 కోట్ల నగదు బహుమతులను విద్యార్థులకు అందజేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా మొదటిస్థానాన్ని సాధించిన విద్యార్థికి రూ.5 లక్షలు, రెండవ స్థానానికి రూ.3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్‌కు రూ.2 లక్షలు, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల టాపర్లకు రూ.1 లక్ష చొప్పున, అలాగే 612 మండలాల టాపర్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 2026 మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు విద్యారంగానికి తోడ్పడటం అభినందనీయమని విద్యార్థులు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈడీఎం సైదేశ్వరరావు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు శ్రీహరిరావు, మేనేజర్ ఉపేందర్, ఎగ్జిక్యూటివ్ జగదీష్, సంబంధిత సిబ్బంది, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


