కమిషనరేట్ పరిధిలో
163 యాక్ట్ అమలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంక్షలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుండి 13న ఓట్ల లెక్కింపు వరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీ ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు. అదేవిధంగా ఎవరూ రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం చేయరాదని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, మద్యం ఉచిత కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయకూడదని తెలిపారు. ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. ఎన్నికల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెక్షన్ 163 యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.


