రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
కాకతీయ, కామేపల్లి: “విత్తనం రైతు సొంతం.. వ్యవసాయం అన్నదాత హక్కు” అనే నినాదం మార్మోగుతుండగా, తెలంగాణ గడ్డపై దేశీయ విత్తన విప్లవం వెల్లివిరిసింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని ‘ది ఎర్త్ సెంటర్’ వేదికగా జరిగిన తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తనాల పండుగ, దేశ విత్తనాల ప్రదర్శన కనులపండువగా సాగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. వారితోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీహరి హాజరయ్యారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. విత్తనం కంపెనీల చేతుల్లో కాకుండా, రైతు చేతుల్లోనే ఉండాలని, అప్పుడే రైతు నిజమైన రాజు అవుతారని స్పష్టం చేశారు. అంతరించిపోతున్న మన పురాతన విత్తనాలను కాపాడుకోవడం ద్వారానే వాతావరణ మార్పులను తట్టుకోగలమని పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతిపైసా రైతు ఖాతాలో చేరేలా కమిషన్ పర్యవేక్షిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వందలాది మంది మహిళా రైతులు, విత్తన సేకర్తలు అరుదైన దేశీయ విత్తనాలను ప్రదర్శించారు. వేల రకాల వరి, చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలు ప్రదర్శించారు.


