కాంగ్రెస్–బీఆర్ఎస్ దొందూ దొందే!
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన రెండు పార్టీలు
420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
మున్సిపాలిటీలకు నిధుల్లేక అభివృద్ధి కుంటుపడింది
అసలైన అభివృద్ధి మోదీతోనే సాధ్యం
బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి
కాకతీయ, కూసుమంచి : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి పూర్తిగా అటకెక్కిందని బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా, ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీల ఏర్పాటు విషయంలో అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చారే తప్ప, వాటికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చితే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే దారిలో “అప్పుల పరిపాలన” కొనసాగిస్తోందని మండిపడ్డారు.
420 హామీలు ఏమయ్యాయి?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 420 హామీలు, ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందని పొంగులేటి ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి లేదు, వృద్ధాప్య పెన్షన్ల పెంపు లేదు, కల్యాణలక్ష్మి నిధులు లేవు, తులం బంగారం మాటే మరిచిపోయారని విమర్శించారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయక, అరకొర చర్యలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పాలన లేకపోయినా, పత్రికల్లో మాత్రం కోట్ల రూపాయల ప్రకటనలతో ప్రజల సొమ్ము వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలైనా, మున్సిపాలిటీలైనా నడవాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే ప్రధాన ఆధారమని పొంగులేటి స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలతో ఇంటింటికీ తాగునీరు అందడం పూర్తిగా కేంద్ర నిధుల వల్లే సాధ్యమైందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి పాలన సాగుతోందని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ప్రజలకు చేసిందేమీ లేదని, అవి కేవలం ఓట్ల రాజకీయాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతులై అవినీతి పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైరా, ఎదులాపురం మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు రంగా కిరణ్, దొంగల సత్యనారాయణ, గోంగూర వెంకటేశ్వర్లు, బండారు నరేష్, నున్న రవికుమార్, రజినీ రెడ్డి, ఆర్‌వీఎస్ యాదవ్, అల్లిక అంజయ్య, బోయల వెంకట్, మనుబోలు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


