14వ వార్డులో జనసేన జోరు
గబ్బర్ సింగ్ టీంతో ప్రచారానికి ఉత్సాహం
మౌలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రముఖ సినీ నటులైన “గబ్బర్ సింగ్ టీం” సభ్యులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీం సభ్యులు అభ్యర్థితో కలిసి ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ విధానాలను ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకురాలు స్వాతి సుధాకర్ అని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అని కొనియాడారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాము గజ్వేల్‌కు వచ్చి ప్రచారంలో పాల్గొన్నామని తెలిపారు. వార్డులో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని స్వాతి సుధాకర్ హామీ ఇచ్చారు. అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సామాన్యుల గొంతు మున్సిపాలిటీలో వినిపించాలంటే గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గబ్బర్ సింగ్ టీం సభ్యులు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


