పంతంగి నాగయ్యను గెలిపించుకుంటాం
మధిరలో ఫాతి మునిషా బేగం వెల్లడి
కాకతీయ, మధిర : మధిర మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు నుంచి పోటీ చేస్తున్న పంతంగి నాగయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముస్లిం మైనార్టీ నాయకురాలు షేక్ ఫాతి మునిషా బేగం స్పష్టం చేశారు. స్థానికుల సమస్యలు తెలిసిన నాయకుడిగా, ప్రజాసేవకుడిగా ఆయనకు విశేష గుర్తింపు ఉందని అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల సంక్షేమానికి నాగయ్య గతంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. వార్డు మెంబర్‌గా పనిచేసిన సమయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించారని పేర్కొన్నారు. అందుకే బీఆర్‌ఎస్, సీపీఐ పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటించాయని తెలిపారు. సీపీఎం పార్టీ తరఫున సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్న పంతంగి నాగయ్య స్థానిక నాయకుడని, వార్డులో ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచి ఆప్యాయంగా పలకరించే గుణం కలవారని కొనియాడారు. ఎన్నికల సమయంలో బయటి నుంచి వచ్చే నాయకుల మాయమాటలను ప్రజలు నమ్మవద్దని ఆమె హెచ్చరించారు. 18వ వార్డు ప్రజలు సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుపై ఓటు వేసి పంతంగి నాగయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


