న్యాయవాదులతో రాయల నాగేశ్వరరావు భేటీ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు కోరిన నేతలు
అభివృద్ధికి అండగా నిలవాలని విజ్ఞప్తి
కాకతీయ, మధిర : ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక న్యాయవాదులతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోండబాల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రామనాధం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని న్యాయవాదులను కోరారు. అధికార పార్టీకి అండగా నిలబడితే స్థానిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, ఈ అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే అధికార పార్టీకి మద్దతు అవసరమని స్పష్టం చేశారు. న్యాయవాదుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, భవిష్యత్తులో వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి న్యాయవాదులు సహకరించాలని నేతలు కోరారు.


