శివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
భక్తులకు సాఫీ దర్శనం కల్పించాలి
అధికారులకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలు
కాకతీయ, వేములవాడ: వేములవాడలో మహా శివరాత్రి జాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీఐపీ దర్శనాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ద్వారాలు, బారికేడింగ్ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, క్యూ లైన్ల నిర్వహణపై ఆలయ ఈఈ రాజేష్‌కు సూచనలు చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యాలను మరింత విస్తృతంగా ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాల్లో అదనపు నీటి పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నూతన బద్దిపోచమ్మ ఆలయం వద్ద ఖాళీ స్థలంలో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కళ్యాణకట్ట వద్ద రద్దీ దృష్ట్యా సౌకర్యాలు పెంచాలని, జాతర సమయంలో మొబైల్ టాయిలెట్ల సంఖ్యను పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. మహా శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పూల అలంకరణతో అందంగా ముస్తాబు చేసి జాతరను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పార్కింగ్ స్థలాల్లో కోడెల టికెట్ కౌంటర్లు, పందిర్లు, శివార్చన స్టేజీల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ రాధాభాయి, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


