ఇల్లందు కాంగ్రెస్‌లోకి నేతల వలస
ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో భారీగా చేరికలు
కాకతీయ, కామేపల్లి: కామేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఇల్లందు పట్టణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇల్లందు మున్సిపాలిటీ 9వ వార్డులో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గందె పద్మ సదానందం ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇతర పార్టీల విధానాలు నచ్చక, ఎమ్మెల్యే కనకయ్య చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కొత్తగా చేరిన నాయకులు ప్రకటించారు.
కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: ఎమ్మెల్యే
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొన్నారు. 9వ వార్డు అభివృద్ధికి గందె పద్మ సదానందం నిరంతరం కృషి చేస్తారని, ఆమె గెలుపు కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్ అభ్యర్థి గందె పద్మ సదానందంపై ప్రజల్లో ఉన్న నమ్మకం, ఎమ్మెల్యే అండదండలతో 9వ వార్డులో కాంగ్రెస్ విజయం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


