10 గంటల్లోనే చైన్ స్నాచర్ పట్టివేత
వృద్ధురాలిపై దాడి చేసిన నిందితుడి అరెస్ట్
కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ సదానందం
కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు కేవలం 10 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం వెల్లడించారు. గ్రామానికి చెందిన మంద గాలమ్మ (68) బుధవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆరపల్లి వంశీకృష్ణ ఇంటి వెనుక తలుపు ద్వారా లోపలికి ప్రవేశించాడు. “మీ కూతురు అరటి పండ్లు ఇవ్వమని పంపింది” అని చెప్పి నమ్మబలికాడు. అనంతరం తాగడానికి నీళ్లు అడిగి, ఆమె వంటింట్లోకి వెళ్లగానే వెంబడించి మెడలోని 27 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కొని, ఆమెను కిందకు నెట్టివేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చేర్యాల పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గొలుసు దొంగతనాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వృద్ధులు, మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.


