హాస్టళ్లలో మెస్ నిర్వహణపై డీసీఎస్ఓ తనిఖీలు
రేషన్ దుకాణాల్లో పంపిణీపై కఠిన ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీసీఎస్ఓ) చందన్ కుమార్ గురువారం ఖమ్మం నగరంలోని పలు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కాలేజ్ హాస్టల్, టేకులపల్లి ప్రాంతంలోని ఖమ్మం అర్బన్ బాలికల హాస్టల్‌ను సందర్శించి వంటశాలలు, భోజన తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డెన్లతో కలిసి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, సరఫరా విధానంపై అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం టేకులపల్లి కేఎసీఆర్ టవర్‌లోని 2236097, 2282064 నంబర్‌ల రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం కింద పేదలకు సమయానికి సరైన రీతిలో బియ్యం పంపిణీ జరగాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పనిచేయాలని డీలర్లను ఆదేశించారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లై డీటీ మెచ్చు వెంకటేశ్వర్లు, ఖమ్మం అర్బన్ డీటీ, రేషన్ డీలర్ వాగదాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


