కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది
దొంగ హామీలతో ప్రజలను వంచించింది
మునిసిపల్ ఎన్నికల్లో దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది
ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డ ఎంపీ వద్దిరాజు
కాకతీయ, కొత్తగూడెం: మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ నెల 11న జరగనున్న కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గులాబీ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ రవిచంద్ర గురువారం కొత్తగూడెంలోని 10వ డివిజన్ బూడిదగడ్డ, 58వ డివిజన్ హనుమాన్ బస్తీ, 25వ డివిజన్ ఏ పవర్ హౌస్ బస్తీల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ఆయన ఉత్తేజభరిత ప్రసంగాలు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని ఎంపీ పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విస్మరించారని, ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో అరాచక పాలన
ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇది పూర్తిగా కేసులు–పోలీసుల ప్రభుత్వం అయిందని ఎంపీ వద్దిరాజు ఘాటుగా విమర్శించారు. అక్రమ కేసులు, బెదిరింపులు, వేధింపులు, అరెస్టులతో ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని, ప్రజలకు కేసీఆర్ ఎప్పటికీ కొండంత అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్యంలో పాలకుల పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ఈ విషయాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. కేసీఆర్ రెండు సంవత్సరాల పాలనను, రేవంత్‌రెడ్డి రెండు సంవత్సరాల పాలనను ప్రజలు స్పష్టంగా పోల్చి చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ఘోర పరాభవం తప్పదని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఛైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, మాజీ వైస్ ఛైర్మన్ వేల్పుల దామోదర్, బీఆర్ఎస్ అభ్యర్థులు వేల్పుల వీరమ్మ, ఏమునూరి శివకృష్ణ, వేముల ప్రసాద్‌బాబు, నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, నవతన్తో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


