అంగన్వాడి పిల్లల పోషణపై ప్రత్యేక దృష్టి
కాకతీయ, కొమురవెల్లి : రసులాబాద్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో తల్లుల కమిటీ సమావేశాన్ని సర్పంచ్ పచ్చిమడ్ల అనూష స్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో పిల్లలందరూ పోషకాహారం తీసుకునే విధంగా తల్లులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతిరోజూ అంగన్వాడి కేంద్రానికి వచ్చి అందిస్తున్న పోషకాహారాన్ని తల్లులు వినియోగించుకోవాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఇది ఎంతో అవసరమని ఆమె తెలిపారు. అంగన్వాడి సేవలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ఉమాదేవి, ఉపసర్పంచ్ సుదర్శన్ స్వామి గౌడ్, అంగన్వాడి టీచర్ భారతి, వార్డు సభ్యులు మల్లేశం, పరశురాములు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


