సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
డిజిటల్ అరెస్టులు అంతా మోసం
అవగాహన ఉంటే..ఆపదలను నివారించొచ్చు
మణుగూరు సబ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి
కాకతీయ,మణుగూరు : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సరైన అవగాహన ఉంటే ఆపదలను సులభంగా నివారించవచ్చని మణుగూరు సబ్ డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి సూచించారు. బుధవారం సైబర్ జాగృక్త దివస్ సందర్భంగా సింగరేణి పీకేఓసీ–2 క్యాంటీన్‌లో కార్మికులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయడం వల్ల అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. మొబైల్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయని, అయితే టెక్నాలజీ అభివృద్ధితో పాటు మోసాలు కూడా పెరిగాయని చెప్పారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, లింకుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
డిజిటల్ అరెస్టు అనేది పూర్తిగా మోసం
“డిజిటల్ అరెస్టు అంటూ ఎక్కడా ఉండదు. కేసులు పెట్టామని, వారెంట్ జారీ చేశామని ఫోన్ చేసి బెదిరిస్తే భయపడవద్దు. ఇవన్నీ సైబర్ నేరగాళ్ల మాయాజాలం మాత్రమే” అని డీఎస్పీ స్పష్టం చేశారు. ఎక్కువ డబ్బు ఇస్తామని ఆశ చూపించే గ్రూపులు, పెట్టుబడి అవకాశాల పేరుతో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఆన్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు వచ్చే లింకులు క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు పంపడం, ఆన్‌లైన్‌లో పరిచయమైన వారితో ఆర్థిక లావాదేవీలు జరపడం ప్రమాదకరమని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడంపై ఏరియా జీఎం దుర్గం రాంచందర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఐ పాటి నాగబాబు మాట్లాడుతూ, కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలని, అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం శ్రీనివాస చారి, డీజీఎం పర్సనల్ ఎస్. రమేష్‌బాబు, ఎస్సై శ్రావణ్ కుమార్, సెక్యూరిటీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


