ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు ఓవరాల్ ఛాంపియన్షిప్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు–2025–26లో కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. తెలంగాణలోని పాత పది జిల్లాల నుంచి పాల్గొన్న జట్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో ఖమ్మం జిల్లా తరఫున పోటీ చేసిన కొత్తగూడెం జట్టు విజయ ఢంకా మ్రోగించింది. బాలుర విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కొత్తగూడెం జట్టు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని జిల్లా కీర్తిని ఇనుమడింపజేసింది. వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ప్రథమ స్థానం, టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ప్రథమ స్థానం, టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో ప్రథమ స్థానం, డిస్క్ త్రోలో ప్రథమ స్థానం సాధించారు. అదేవిధంగా బాలికల టేబుల్ టెన్నిస్‌లో తృతీయ స్థానం, బాలుర 4×400 మీటర్ల రిలే రేస్‌లో తృతీయ స్థానం దక్కించుకున్నారు.
ఈ విజయాలతో బాలుర విభాగంలో మొత్తం ఛాంపియన్షిప్ ట్రోఫీని కొత్తగూడెం పాలిటెక్నిక్ విద్యార్థులు అందుకున్నారు. విజేతలైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడా శిక్షకుడు పీడీ కృష్ణారావు, ఎలక్ట్రికల్ విభాగాధిపతి తారాసింగ్, అధ్యాపకులు స్వప్న, కృష్ణ, ధరణి, సిబ్బంది సందీప్, కౌసల్య తదితరులు విజేతలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు వారు సూచించారు.


