బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే ప్రజలకు కనిపిస్తోంది
ఎదులాపురంలో మునిసిపల్ ఎన్నికల్లో కందాళ ఉపేందర్ రెడ్డి
కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఎం పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంజం మాలతి ప్రచారంలో జోరు పెంచారు. బుధవారం సాయి ప్రభాత్ నగర్ ఫేజ్–1లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు–ఎమ్మెల్సీ తాతా మధు ప్రచారంలో పాల్గొన్నారు. వారితో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ 6వ వార్డు ఇంచార్జ్, నేలకొండపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు, మండల నాయకుడు నంబూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే నేటికీ ప్రజలకు కనిపిస్తోందని అన్నారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఏ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సమర్థులైన అభ్యర్థులను బీఆర్ఎస్–సీపీఎం కూటమి తరఫున నిలబెట్టామని తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ఇంజం మాలతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని అభ్యర్థి ఇంజం మాలతి హామీ ఇచ్చారు.


