మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన
కాకతీయ, చేర్యాల : చేర్యాల మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో మహిళల కోసం నూతన భవన నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుండి మంజూరైన రూ.10 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ భవన నిర్మాణం చేపడుతున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘం సభ్యులు సర్పంచ్ శెట్టే కొమురయ్యను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిమ్మ లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్, వార్డు సభ్యులు కరుణాకర్, సురేష్, శ్రీలత, కుర్మ సంఘం మండల అధ్యక్షులు శేవల్ల రాజయ్య, సీఏ మలిపెద్ది సుజాత, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు బండ సుజాతతో పాటు మహిళా సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


