ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
పట్టాదారు పాసుబుక్ ఉన్న ప్రతి రైతు నమోదు కావాలి
అవగాహన కార్యక్రమంలో ఏడీఏ స్వర్ణ విజయచంద్ర సూచన
కాకతీయ, బోనకల్ : పట్టాదారు పాసుబుక్ కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేయించుకోవాలని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయచంద్ర సూచించారు. మండల పరిధిలోని ముష్టికుంట్ల రైతు వేదికలో రైతు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆధార్ ద్వారా ప్రతి పౌరుడికి ప్రత్యేక సంఖ్య కేటాయించినట్టే, ప్రతి రైతుకు కూడా పదకొండు అంకెల విశిష్ట సంఖ్య కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.
ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రైతులు తమ ఫార్మర్ ఐడీ పొందేందుకు పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ భీమా, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రత మిషన్ వంటి పథకాల అమలుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా అనుసంధానమవుతుందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఈ రిజిస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి మరీదు త్రివేణి, గ్రామ రైతులు పాల్గొన్నారు.


