కొత్తగూడెంలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో గులాబీ శ్రేణుల ప్రదర్శన
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి *కల్వకుంట్ల చంద్రశేఖర రావు*కు సిట్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, నాయకులు శాంతి నాయక్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గులాబీ, నల్ల కండువాలు ధరించిన బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి సర్కార్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తూ సుస్థిర పాలన అందించిన కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సిగ్గుమాలిన చర్యగా యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తరహా నోటీసులు జారీ చేస్తున్నారని విమర్శించారు.కేసీఆర్‌పై కక్షపూరిత రాజకీయాలు కొనసాగిస్తే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణిచివేయాలన్న ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు, మాజీ ఎంపీపీ బాధావత్ శాంతి, నాయకులు కొప్పరి నవతన్ తదితరులు పాల్గొన్నారు.


