కేసీఆర్‌పై సిట్ వేధింపులు
మణుగూరులో బీఆర్ఎస్ నిరసన
పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
‘ధర్నా చేసే హక్కు మాకులేదా?’ : రేగా కాంతారావు
‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ హెచ్చరిక
కాకతీయ, మణుగూరు : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణ పేరుతో వేధింపులు జరుగుతున్నాయని నిరసనగా చేపట్టిన ధర్నాను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నించారని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ… కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి, సిట్ పేరుతో వేధించడం కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. చేతకాని పాలనతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి వచ్చిందని, అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు.


ధర్నా చేసుకునే హక్కు లేదా..?!
కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలపడానికి ధర్నా చేస్తే, కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో చెప్పాలని రేగా డిమాండ్ చేశారు. ప్రజల కోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ధర్నా చేసే హక్కు తమకు లేదా? అని నిలదీశారు. రాజకీయం రాజకీయం లాగే ఉండాలని హితవు పలికారు. మితిమీరిన రాజకీయాలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ నాయకులకు రేగా హెచ్చరికలు జారీ చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ రాజకీయ సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ను అణిచివేయాలన్న ప్రయత్నాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం
ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రేగా కాంతారావు ఆగ్రహానికి లోనై కాంగ్రెస్ కార్యకర్తలపై కర్ర ఎత్తారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న సీఐ నాగబాబు జోక్యం చేసుకుని వివాదాన్ని శాంతింపజేశారు. రేగా చేతిలోని కర్రను లాక్కొని, ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. మాజీ ఎమ్మెల్యే కర్ర ఎత్తిన ఘటన మణుగూరులో హాట్ టాపిక్‌గా మారింది.


