పాత నేరస్తులపై నిఘా ఉంచాలి
ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించాలి
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్
కొత్తగూడ, గంగారం పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు
విధుల నిర్వహణపై ఎస్సైలకు దిశానిర్దేశం
కాకతీయ, మహబూబాబాద్ : పాత నేరస్తులపై కఠిన నిఘా ఉంచాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం గంగారాం, కొత్తగూడ పోలీస్ స్టేషన్లను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల విపిఓలు రెండు మూడు రోజులకు ఒకసారి గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వినాయక నవరాత్రుల నేపథ్యంలో గ్రామాల్లో ఏర్పాటైన మండపాల వివరాలు సేకరించి, ఆర్గనైజర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్లలో కేసులలో ఉన్న వాహనాలను త్వరగా యజమానులకు అప్పగించాలని ఎస్ఐలకు సూచించారు.

బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ల విధుల్లో అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. సీసీటీఎన్ఎస్ డేటాను ప్రతిరోజూ అప్డేట్ చేయాలని తెలిపారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, జూదం, పీడీఎస్ రైస్ దుర్వినియోగం వంటి వాటిపై నిఘా ఉంచి కేసులు నమోదు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో నీతి, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తే ప్రజల మన్ననలు పొందగలరని ఎస్పీ అన్నారు. ఉదయం, సాయంత్రం విసిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పాత నేరస్తులు, సస్పెక్టులపై కఠిన నిఘా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగారం ఎస్సై బి. రవికుమార్, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


