కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం మల్లన్న ఇప్పుడు తిరుపతి వెంకన్నతో ఆదాయంలో పోటీ పడుతున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు రికార్డు స్థాయికి చేరాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో భక్తుల భక్తి ప్రవాహం మరోసారి హుండీ ఆదాయంలో ప్రతిఫలించింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయాల్లో గత 27 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకనేందకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మడుపులు, ముక్కులే కాకుండా కానుకల రూపంలోనూ చెల్లించుకున్న నగదుతో హుండీలు నిండిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 4కోట్ల 51లక్షల 62వేల 522నగదుతోపాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించాయి.
ఈ హుండీ లెక్కింపును చంద్రావతి కల్యాణ మండపంలో పకడ్బందీగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారులు, పలు విభాగాల సిబ్బంది, శివసేవకులు, భక్తులు ఇందులో పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపును చేపట్టారు. విదేశీ కరెన్సీ పెద్దమొత్తంలో లభించింది. పలు దేశాల నుంచి తరలివచ్చిన ప్రవాస భారతీయులు, విదేశీ భక్తులు సొంత కరెన్సీని కూడా కానుకల రూపంలో సమర్పించారు. దీనిలో అమెరికా డాలర్లు, న్యూజిలాండ్ డాలర్లు, సింగపూర్, యూరోలు, ఓమన్ బైసా, ఇంగ్లండ్ పౌండ్స్, కెనడా డాలర్లు, అరేబియా రియాల్స్, ఖత్తార్ రియాల్స్ ఉన్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాదు..విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా దేవాలయానికి విరాళాలు అందించారు. నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీలను దేవస్థానం ఖజానాలో జమ చేస్తారు. ఈ మొత్తం ఆలయ అభివ్రుద్ధి కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వినియోగిస్తామని తెలిపారు.


