మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం
సినిమాల మధ్యే ట్రాఫిక్ అవగాహన
హెల్మెట్, సీట్‌బెల్ట్‌పై ప్రత్యేక ప్రచారం
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న మార్గాన్ని రవాణా శాఖ ఎంచుకుంది. ప్రజల్లోకి త్వరగా చేరే వేదికగా ప్రైవేట్ మినీ మూవీ థియేటర్లను వినియోగిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. థియేటర్లలో లఘు చిత్రాలు, ప్రకటనల రూపంలో హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపరాదన్న అంశాలపై వీడియోలు ప్రదర్శిస్తున్నామని వాహన తనిఖీ అధికారి కంచి వేణు తెలిపారు.
సినిమా ముగిసిన తర్వాత పార్కింగ్ వద్ద కూడా వాహనదారులకు హెల్మెట్ ధరించాలంటూ సూచనలు ఇవ్వాలని, మద్యం సేవించిన వారిని హెచ్చరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో మొదట నష్టపోయేది డ్రైవర్లేనని, కుటుంబ బాధ్యతను గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డు బుర్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు.


