జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం
అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్
రాష్ట్ర కో కన్వీనర్ కే. బాపురావు
కాకతీయ, కరీంనగర్ : ఎన్టీవీ చానల్‌లో ప్రసారమైన ఓ కథనానికి సంబంధించి ఎటువంటి ముందస్తు విచారణ లేకుండా, నోటీసులు జారీ చేయకుండా ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర అన్యాయమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కో కన్వీనర్ కుడుతాడి బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను బాధ్యులుగా చేస్తూ నేరుగా అరెస్టు చేయడం దారుణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీడియాలో ప్రసారమయ్యే లేదా ప్రచురితమయ్యే కథనాలకు సంబంధిత సంస్థ ఎడిటర్, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, సంస్థలో పని చేసే జర్నలిస్టులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం అన్యాయమని ప్రశ్నించారు.తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తన ప్రభుత్వంలోని అధికారులు అనుసరిస్తున్న ఈ విధానంపై నిష్పక్షపాత విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు దశాబ్దాలుగా జర్నలిజం రంగంలో సేవలందిస్తున్న ఈ ముగ్గురు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర కోణం కనిపిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ వీరు ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు.
జర్నలిజం వృత్తిలో పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది బహుజన వర్గాలకు చెందినవారని, సరైన వేతనాలు లేకపోయినా వృత్తి పట్ల నిబద్ధతతో యాజమాన్యాల ఆదేశాల మేరకు పని చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. అలాంటి బలహీన వర్గాలకు చెందిన జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని టీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, సిట్ పర్యవేక్షణాధికారి సజ్జనార్‌కు విజ్ఞప్తి చేశారు. బాధ్యత వహించాల్సిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా అమాయక జర్నలిస్టులను అరెస్టు చేయడం సరైంది కాదని, ఈ చర్యలు ఇతర జర్నలిస్టులను భయపెట్టేందుకేనని బాపురావు విమర్శించారు.


