రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్దరి అరెస్టు..
ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
టాస్క్‌ఫోర్స్–వన్‌టౌన్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రూ.15 లక్షల విలువైన నిషేధిత గంజాయి ద్రవాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం కొత్తగూడెం వన్‌టౌన్ ఎస్సై ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సీఐ రమకాంత్, ఎస్సై ప్రవీణ్, వన్‌టౌన్ ఎస్సై రాజేష్‌లు పోస్ట్ ఆఫీస్ సెంటర్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి గంజాయితో తయారు చేసిన మూడు లీటర్ల నిషేధిత ద్రవం లభ్యమైంది.
రూ.15 లక్షల విలువైన నిషేధిత ద్రవం
పట్టుబడిన గంజాయి ద్రవం మార్కెట్ విలువ సుమారు రూ.15 లక్షలుగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ ద్రవాన్ని మత్తు పదార్థంగా వినియోగించేందుకు అక్రమంగా తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో జగదల్పూర్ గ్రామం, బస్తార్ జిల్లా (ఛత్తీస్‌గఢ్)కు చెందిన తిమితి బేల, మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఇంతంగి మీనలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో త్రీటౌన్ సీఐ శివప్రసాద్, వన్‌టౌన్ ఎస్సై రాజేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి రహిత జిల్లానే లక్ష్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను గంజాయి, మత్తు పదార్థాల నుంచి పూర్తిస్థాయిలో విముక్తం చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గంజాయి మత్తుకు బానిసై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ సహకారంతో కఠిన చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాలపై ఎలాంటి సడలింపు ఉండదని, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.


