భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత
సాగు ఖర్చులు తగ్గితేనే ఆదాయం పెరుగుతుంది
అవసరానికి మించి యూరియా వాడొద్దు
డ్రోన్ వ్యవసాయంతో దిగుబడులు పెంపు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సాగు ఖర్చులు తగ్గిస్తూ రైతుల ఆదాయం పెరిగేలా నూతన సాగు పద్ధతులు అవలంబించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో బేయర్స్ కంపెనీ వ్యవసాయ డ్రోన్‌లను సోమవారం ప్రారంభించారు. వ్యవసాయ డ్రోన్‌ల ద్వారా పురుగుల మందులు, ఎరువులు అవసరమైన మోతాదులోనే చల్లడం వల్ల భూసారం పెరుగుతుందని మంత్రి తెలిపారు. యూరియా వినియోగం తగ్గి పంట దిగుబడులు మెరుగుపడతాయని చెప్పారు. అధిక రసాయనాల వినియోగం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
నకిలీ విత్తనాల ముప్పుపై కూడా మంత్రి హెచ్చరించారు. హెచ్‌డీ విత్తనాల పేరిట బోగస్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎకరానికి 12 క్వింటాళ్ల యూరియా ప్రమాదమే
కొంతమంది రైతులు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల యూరియా వినియోగిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆ భూముల్లో గడ్డి కూడా మొలవదని హెచ్చరించారు. యూరియా ధర తక్కువగా ఉండటం వల్ల అధిక వినియోగం జరుగుతోందని, ఎరువుల ధరల క్రమబద్ధీకరణపై కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. వ్యవసాయ డ్రోన్‌ల వినియోగంపై రైతులకు శిక్షణ ఇచ్చి, సబ్సిడీపై అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. శాటిలైట్ ఆధారంగా తెగుళ్లు గుర్తించి అక్కడ మాత్రమే మందులు చల్లే పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


