భారత్‌లో స్థిరత్వం
ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మనం సేఫ్
ప్రధాని నరేంద్ర మోదీ
కాకతీయ, నేషనల్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ రాజకీయ స్థిరత్వం, సుస్థిరతతో ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తుందని వెల్లడించారు. ప్రస్తుత సమయంలో మౌలిక సదుపాయాలతో పాటు, పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న కార్మిక శక్తి అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం గుజరాత్ కఛ్‌లో ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.
సౌరాష్ట్ర, కచ్ ముఖ్యమైన పాత్ర
ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి ఊతం ఇవ్వడానికి సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారుతున్నాయని మోదీ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడంలో సౌరాష్ట్ర, కచ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించే మార్కెట్ ఆధారిత ప్రక్రియ అని అభివర్ణించారు. ఇక్కడి వివిధ పారిశ్రామిక క్లస్టర్లలో, స్క్రూడ్రైవర్ల నుంచి ఆటో విడిభాగాలు, యంత్ర పరికరాలు, లగ్జరీ కార్ లైనర్లు, విమానాల విడిభాగాలు, యుద్ధ విమానాలు, రాకెట్ల వరకు ప్రతిదీ రాజ్‌కోట్‌లో తయారు చేస్తున్నారని మోదీ తెలిపారు. అదేవిధంగా సవాలు ఎంత పెద్దదైనా కృషి, పట్టుదల , నిజాయతీతో ముందుకు సాగితే విజయం అనివార్యమని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు మనకు నేర్పుతున్నాయని మోదీ అన్నారు. ఒకప్పుటి తాగునీటి, విద్యుత్ సమస్యలను సౌరాష్ట్ర, కచ్ ప్రజలు తమ కృషితో మార్చుకున్నారని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాంతాలు నేడు ఎన్నో అవకాశాలను సృష్టిస్తున్నాయని, అదేవిధంగా భారతదేశ వృద్ధికి అవి ఒక లంగరు ప్రాంతంగా మారాయని అభివర్ణించారు. అదే విధంగా గ్రీన్ డెవలప్‌మెంట్, గ్రీన్ మొబిలిటీ, ఇంధన భద్రతకు సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు ప్రధాన కేంద్రంగా మారుతున్నాయి. కచ్‌లో 30 గిగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన పార్క్ నిర్మిస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్క్ అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. కచ్, జామ్‌నగర్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయని, కచ్‌లో భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారని మోదీ అన్నారు.


