టెట్ ప్రశాంతం!
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు
రెండు సెషన్లలో సజావుగా నిర్వహణ
జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్‌లో నిర్వహించిన పరీక్షలను ఆయన పరిశీలించారు. కలెక్టర్ వివరాల ప్రకారం సెషన్–1లో 100 మందికి పరీక్ష కేటాయించగా 89 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరయ్యారు. అలాగే సెషన్–2లో 100 మందికి గాను 88 మంది పరీక్ష రాయగా 12 మంది గైర్హాజరయ్యారు.
పటిష్ట ఏర్పాట్లు
పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు నియమించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో టెట్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన భద్రతా చర్యలు, పర్యవేక్షణ వల్లే పరీక్షలు విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన స్పష్టం చేశారు.


