ఐఎన్‌టీయూసీ జిల్లా సర్వసభ్య సమావేశం
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, భారీ కార్మిక ర్యాలీ
కాకతీయ, ఖమ్మం : ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు జిల్లా సర్వసభ్య సమావేశం, భారీ కార్మిక ర్యాలీని ఆదివారం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. అసంఘటిత రంగం, ఆటో యూనియన్ కార్మికులతో నిర్వహించిన ర్యాలీని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు కొత్త సీతారాములు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దిబ్బల సౌజన్య, రాష్ట్ర నాయకులు సాధు రమేష్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొందయ్య, ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఏ. జలీల్, రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు మల్లేష్ గౌడ్, మోటార్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ రెడ్డి, ఎస్‌వీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఐఎన్‌టీయూసీకి కొత్త సీతారాములు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై ఇకపై తక్షణమే స్పందిస్తామని హామీ ఇచ్చారు. నగర ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నరేష్ మోహన్ నాయుడు పార్టీకి కట్టుబడి చురుకుగా పనిచేసే నాయకుడని ప్రశంసించారు. జిల్లా ఆటో–మోటార్ రంగం అధ్యక్షుడిగా పాల్వంచ కృష్ణ నియామకాన్ని స్వాగతించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ తుమ్మల యుగంధర్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.


