సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు
సర్పంచ్ యాకాలక్ష్మి ముందడుగు
రైతులు, ప్రజల నుంచి అభినందనలు
కాకతీయ, పెద్దవంగర : గట్లకుంట–రంగాపురం గ్రామాల మధ్య రహదారిపై భారీ గోతులు ఏర్పడి వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గట్లకుంట గ్రామ సర్పంచ్ ముత్తినేని యాకాలక్ష్మి సోమన్న తన సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. ఆదివారం రెండు గ్రామాలను కలిపే ప్రధాన మార్గంలో ట్రాక్టర్ల ద్వారా మట్టి పోసి, డోజర్ సహాయంతో గోతులను పూడ్చి రహదారిని సరిచేశారు. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమయ్యాయి. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా ప్రజా సమస్యకు తక్షణమే స్పందించిన సర్పంచ్ చర్యను రైతులు, స్థానికులు అభినందించారు. ప్రజల సౌకర్యమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మరమ్మత్తు కార్యక్రమంలో గట్లకుంట గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.


