సంక్రాంతి వేడుకలకు కమ్యూనిస్టు టచ్
సిపిఐ శత దినోత్సవాల్లో ముగ్గుల సందడి
శేషగిరి నగర్‌లో మహిళలకు రంగుల పోటీలు
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత దినోత్సవాల సందర్భంగా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ గ్రామంలో మహిళా సమాఖ్య, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, సిపిఐ ఆధ్వర్యంలో రంగురంగుల ముగ్గుల పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, చాతకొండ సర్పంచ్ ఈశ్వరి, మహిళా సమాఖ్య నాయకురాళ్లు హాజరయ్యారు. ముగ్గుల పోటీలకు జడ్జీలుగా కామ్రేడ్ మునిగడప పద్మ, సింగరేణి సేవా సమితి నాయకురాలు మునిల వ్యవహరించారు.
మహిళల ఉత్సాహం.. గ్రామమంతా పండుగ కళ
రంగురంగుల ముగ్గులతో మహిళలు తమ కళా ప్రతిభను ప్రదర్శించడంతో శేషగిరి నగర్ పండుగ కళను సంతరించుకుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు కరిష రత్నకుమారి మాట్లాడుతూ.. గ్రామ మహిళల ఉత్సాహం అభినందనీయమని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్నా లక్ష్మీకుమారి మాట్లాడుతూ, జనవరి 18న ఐదు లక్షల మందితో నిర్వహించనున్న సిపిఐ భారీ బహిరంగ సభకు మహిళలందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మహిళలకు చైతన్యవంతమైన సందేశం అందించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, మహిళా సమాఖ్య నాయకురాళ్లు, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు ధర్మ, రాములు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మి, రేణిగుంట్ల లక్ష్మి, బానోతు శాంతి, గుంటి సునీత, మంద విజయనిర్మల, మేదిని లక్ష్మి, ఎస్.కె. షాహిన్, మద్దెల విజయలక్ష్మి, వెంకట నరసమ్మ, పొలమూరి ధనలక్ష్మి, ఎస్‌డీ కైసర్, రమ, దేవి తదితరులు పాల్గొన్నారు.


