కాకతీయ ఎఫెక్ట్..!
అండర్ బ్రిడ్జికి మరమ్మతుల
కథతీయ కథనానికి స్పందించిన అధికారులు

కాకతీయ, కొత్తగూడెం : కాకతీయ దినపత్రిక కథనానికి అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా మారిన రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జి మధ్యలో వరద నీరు నిల్వ ఉండటంతో రహదారిపై కంకర కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గుంతల మధ్య నుంచి ఐరన్ చువ్వలు పైకి లేచి ఉండటంతో వాహనదారులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితితో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతుండగా, శుక్రవారం కాకతీయ దినపత్రికలో “డేంజర్ స్పాట్‌గా రైల్వే అండర్ బ్రిడ్జ్” శీర్షికతో కథనం ప్రచురితమైంది.

కథనానికి స్పందించిన యంత్రాంగం
కాకతీయ కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న సంబంధిత శాఖ అధికారులు శనివారం రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకుని గుంతలకు మరమ్మత్తులు చేపట్టారు. రోడ్డును సమతలంగా మార్చడంతో పాటు ప్రమాదకరంగా బయటకు వచ్చిన ఐరన్ చువ్వలను తొలగించారు. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి దోహదపడుతున్న కాకతీయ దినపత్రిక పాత్రను వాహనదారులు ప్రశంసించారు. సమస్య పరిష్కారానికి కారణమైన కాకతీయ యాజమాన్యానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.


