ప్లాట్ కబ్జా చేసి ఇల్లు కడుతున్నారు
ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు!
60వ డివిజన్ కార్పొరేటర్‌పై మహిళ సంచలన ఆరోపణలు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్ కార్పొరేటర్ తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాట్‌ను అక్రమంగా ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నాడని, ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఎస్.కె. మహబూబి అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆమె తన కుమారులు షేక్ జానీ, 46వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌కే రజ్జిల్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహబూబి తెలిపిన వివరాల ప్రకారం.. 2003లో ప్రభుత్వం రుద్వోజు ప్రేమతీలకు కేటాయించిన 84 గజాల ప్లాట్‌ను రూ.87 వేలతో తాను కొనుగోలు చేశానని తెలిపారు. 2023లో జీవో 58, 59 కింద తన పేరు మీద క్రమబద్ధీకరణ పూర్తయిందని, ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరైందని చెప్పారు. అయితే ఆ స్థలంలోకి వెళ్లకుండా కార్పొరేటర్ అడ్డుకుంటున్నాడని, ప్రశ్నిస్తే ప్రాణహానీ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కేసు కూడా నమోదు చేయడం లేదని, పోలీసుల ముందే కార్పొరేటర్ బూతులు తిడుతున్నాడని వాపోయారు. అన్ని ఆధారాలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తన ప్లాట్‌ను తనకు అప్పగించి, ప్రాణ రక్షణ కల్పించాలని ఆమె కోరారు.


