ఆర్థిక సమస్యల ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య
స్నేహితులకు వీడియో కాల్ చేసి బలవన్మరణం
రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్‌లో విషాదం
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పొన్నాల సంజీవరెడ్డి (31) ఆర్థిక సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల భారంతో కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు సంజీవరెడ్డి దుబాయ్‌లో ఉన్న తన స్నేహితులకు వీడియో కాల్ చేసి తన పరిస్థితిని చూపించినట్లు సమాచారం. విషయం గ్రహించిన స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లేసరికి సంజీవరెడ్డి మృతి చెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


