కుష్టు నిర్మూలన దిశగా విస్తృత సర్వే
1708 మంది అనుమానితులు గుర్తింపు
22 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ
: డీఎంహెచ్‌వో డా. తుకారం రాథోడ్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత నెల 18 నుంచి 31 వరకు నిర్వహించిన ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేలో 1,708 మంది అనుమానితులను గుర్తించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారం రాథోడ్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,013 మందిని పరీక్షించగా 22 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ చేసి మందులు అందించినట్లు తెలిపారు. కొమరారం, గుండాల, రొంపేడు, చండ్రుగొండ, ఏర్రగుంట ఆరోగ్య కేంద్రాల పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 52 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతుండగా, అందులో 45 ఎంబీ, 7 పీబీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, అపోహలు వీడి వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. బి. పుల్లా రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ జి. భద్రు మోహన్, డీపీఎంఓలు పాల్గొన్నారు.


