ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు థియరీ పరీక్షలు
జిల్లాలో 66 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో జనరల్, వొకేషనల్ కలిపి మొత్తం 35,188 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు.
జిల్లాలో 66 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 67 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జరుగుతాయని వివరించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆంగ్లం ప్రాక్టికల్ పరీక్ష జనవరి 21న, రెండవ సంవత్సరం విద్యార్థులకు జనవరి 22న నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 23న ఎథిక్స్, మానవ విలువలు, జనవరి 24న పర్యావరణ అవగాహనపై ఇంటర్నల్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలు తప్పనిసరి
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీటి సదుపాయం కల్పించాలని, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు పరీక్షా కేంద్రాల రూట్లలో స్పెషల్ బస్సులు నడపాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో పనిచేసే ఇన్విజిలేటర్లకు అవసరమైన శిక్షణ అందించాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ జరగకుండా చీఫ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల సమక్షంలోనే ప్రశ్నాపత్రాల సీల్స్ ఓపెన్ చేయాలని, ఆ సమయంలో సెల్‌ఫోన్లు తీసుకురాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్ఓ పద్మశ్రీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె. రవిబాబు, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ, మునిసిపల్, పోస్టల్, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


