ఖమ్మం నగర అభివృద్ధిపై బీజేపీ పోరు
అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలి
ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
శివారు డివిజన్ల ప్రజా కష్టాలు తీర్చండి
మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి వినతి
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు, హిందూ దేవాలయాల రక్షణ, అక్రమ కట్టడాల తొలగింపుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేసింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కమిషనర్‌ను కలిసి, నగర పరిధిలో ముఖ్యంగా శివారు డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
కార్పొరేషన్ పరిధిలోని శివారు డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సరైన సైడ్ డ్రైన్స్ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచిపోతుండటంతో దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే పక్కా డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 23వ డివిజన్‌లో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లను వెడల్పు చేసి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
దేవాలయాల రక్షణపై నిర్లక్ష్యం
నగరంలో హిందూ దేవాలయాల అభివృద్ధి, రక్షణను మున్సిపల్ యంత్రాంగం విస్మరిస్తోందని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఆలయాలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఆవరణలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు మున్సిపల్ నిధులతో రక్షణ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు. భక్తుల సౌకర్యార్థం, ముఖ్యంగా మహిళల కోసం స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా దేవాలయాల వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఫుట్‌పాత్‌లపై అక్రమ ఆక్రమణల వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే తొలగించి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ఇక 37వ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని, 1వ టౌన్ ప్రాంతంలో ప్రజల అవసరాల దృష్ట్యా సమీకృత కూరగాయల మార్కెట్, రైతు బజార్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నగర సాంస్కృతిక వికాసం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పనులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మందడపు సుబ్బారావు, దొంగల సత్యనారాయణ, గుత్తా వెంకటేశ్వరరావు, వీరెల్లి రాజేష్ గుప్తా, రవి గౌడు, బోయినపల్లి సురేష్, కొమిలి శ్రీనివాస్, అల్లిక అంజయ్య, గడిల నరేష్, చిన్ని కృష్ణ, తడుపునూరి రవీందర్, చారి, రాము, కంపసాటి అజయ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


