గిరిజనుల జామాయిల్ పంటపై దాడి
ధ్వంసానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామంలో గిరిజనులు పండించిన జామాయిల్ పంటను అక్రమంగా ధ్వంసం చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, గట్టుమల్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 112, 113, 114, 115, 116లలోని ప్రభుత్వ సీలింగ్ భూములను 1974లో సమగ్ర సర్వే నిర్వహించి, 1976లో అప్పటి ప్రభుత్వం 18 మంది గిరిజనులకు 54 ఎకరాల భూమిని (ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు చొప్పున) పట్టాలుగా కేటాయించిందని తెలిపారు. అప్పటి నుంచి గిరిజనులు ప్రభుత్వ పట్టాలతోనే వ్యవసాయం చేస్తూ, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందుతూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.
పంట ధ్వంసం.. బెదిరింపులు..
ఈ భూముల్లో గిరిజనులు జామాయిల్ పంట వేసుకొని మొదటి క్రాప్ కోత పూర్తిచేసిన తర్వాత, రెండో క్రాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో స్థానిక గిరిజనేతర వ్యక్తి చెరుకుమల్ల వెంకట నరసయ్య నేతృత్వంలో వచ్చిన వ్యక్తులు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం అక్రమంగా సుమారు ఒక ఎకరం జామాయిల్ పంటను నరికివేసి ధ్వంసం చేశారని ఆరోపించారు. దీనిని ప్రశ్నించిన గిరిజనులను చంపుతామని బెదిరించడం అప్రజాస్వామిక చర్యగా వారు తీవ్రంగా ఖండించారు. గిరిజనుల పంటలను ధ్వంసం చేసిన వారిపై ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు గిరిజన సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నా రక్షణ కరువు
ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ గిరిజన భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టుమల్ల గ్రామ ఘటన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు సమగ్ర భూ సర్వే నిర్వహించి, పట్టాదారులైన గిరిజనులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు పట్టాలు ఎలా వచ్చాయో విచారణ చేయాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ పట్టాలు జారీ అయ్యాయని ఆరోపించారు. ఆ అక్రమ పట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయం జరగకపోతే ఆందోళన తీవ్రత
గిరిజనులకు న్యాయం చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షతో పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాటోత్ కృష్ణ, పూనం నాగేశ్వరరావు, బానోతు ధర్మ, వాంగ్డోత్ సురేష్ తదితర నాయకులు, గిరిజన రైతులు కుంజా లక్ష్మయ్య, పడిగ సీతయ్య, బండా వెంకటేశ్వర్లు, పడిగా రాజారావు, శెట్టిపల్లి భాగ్యమ్మ, వాసం సావిత్రి, బట్టు వీరబాబు, బట్టు బాబు తదితరులు పాల్గొన్నారు.


