మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త నాటకం
మధిర నాడు అభివృద్ధి.. నేడు విధ్వంసం
డిప్యూటీ సీఎం భట్టి పనితీరుపై ప్రశ్నలు
కమిటీ పేరుతో కమిషన్ డ్రామా
బీఆర్‌ఎస్‌దే అభివృద్ధి ఘనత
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గత పదేళ్లలో మధిర పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకేనని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా బీఆర్‌ఎస్‌కే ఉందని మధిర నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు స్పష్టం చేశారు. గురువారం మధిరలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండేళ్ల పాలనలో మధిర పట్టణానికి తట్టెడు మట్టి కూడా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరిట విధ్వంసమే తప్ప మరొకటి కనిపించడం లేదని తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మధిర అభివృద్ధి ఒక్కసారిగా గుర్తుకు వచ్చిందని, అందుకే కొత్త డ్రామాకు భట్టి విక్రమార్క తెరలేపారని కమల్ రాజు దుయ్యబట్టారు. అభివృద్ధి కమిటీ పేరుతో క్యాంపు కార్యాలయంలో రెండు సార్లు సమావేశాలు పెట్టి కాలం వృథా చేయడం తప్ప ప్రజలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. మధిర ప్రజలు విజ్ఞులని, కాంగ్రెస్ పార్టీ చేసే నాటకాలను బాగా గ్రహిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.
నాడు అభివృద్ధి.. నేడు విధ్వంసం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వందల కోట్లతో మధిర పట్టణాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ట్యాంక్ బండ్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను నేటి పాలకులు ధ్వంసం చేసిన చరిత్ర ఉందని ఆరోపించారు. నేడు శంకుస్థాపనల పేరుతో కాలం వెల్లబుచ్చడం తప్ప ప్రజలకు కనిపించే అభివృద్ధి ఏదీ లేదన్నారు. మధిర ప్రజలు అభివృద్ధి చేసిన వారి వైపే నిలుస్తారని, విధ్వంసం చేసిన వారి వైపు నిలబడరని కమల్ రాజు తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తార్ నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ మధిర పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మాజీ శివాలయం కమిటీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, మాజీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వై.వి. అప్పారావు, భువనగిరి నారాయణ, ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి, ధీరావత్ మాధవి, వేల్పుల శివ, అబ్దుల్ కురేష్, చీదిరాళ్ల రాంబాబు, రేడపంగి గోపాల్, స్వామి, ఆరుద్ర కొండ తదితరులు పాల్గొన్నారు.


