కొత్తగూడెంలో 28న ఏజెన్సీ దళిత ర్యాలీ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ కులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 28వ తేదీన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు దళిత ఏజెన్సీ హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చదలవాడ సూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అవకాశాలు లేకుండా దళితులను కావాలనే వెనుకబాటుకు నెట్టుతున్నారని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టి పెరిగి జీవనం సాగిస్తున్న దళితులకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులు ఇప్పటికీ అత్యంత వెనుకబాటులో ఉన్నారని, వారు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో షెడ్యూల్ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో రాజ్యాంగం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దళితులకు సమాన హక్కులు ఉండేవని, అయితే కొంతమంది కుట్రదారుల వల్ల అవి నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. తమ హక్కుల సాధన కోసం భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల దళిత ప్రజానికం భారీగా తరలిరావాలని చదలవాడ సూరి పిలుపునిచ్చారు.


