సీతానాగారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గోల్‌మాల్!
వార్డెన్ ఇష్టారాజ్యం… పిల్లల భవితకు ముప్పు
సెలవుల్లేకున్నా ముందస్తుగా విద్యార్థులను ఇళ్లకు పంపింపు
హాస్టల్‌లో లేనప్పటికీ రికార్డుల్లో ఉన్నట్లే నమోదు
వారానికి ఒకటి–రెండు రోజులు మాత్రమే విధుల్లో వార్డెన్
తప్పిదాల పేరుతో విద్యార్థుల నుంచి ఫైన్ల వసూళ్లు

కాకతీయ, నిఘా ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానాగారం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.హాస్టల్ వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెయింటెనెన్స్ ఖర్చులు మిగిల్చుకునే ఉద్దేశంతో సెలవులు లేకున్నా ముందుగానే విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే, వాస్తవానికి పిల్లలు హాస్టల్‌లో లేనప్పటికీ రికార్డుల్లో మాత్రం విద్యార్థులు ఉన్నట్లే నమోదు చేస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి కొన్ని స్పష్టమైన ఆధారాలు కాకతీయకు చిక్కాయి.

విధుల్లో అరుదుగా… నిర్వహణ వాచ్‌మెన్ చేతుల్లో?
హాస్టల్‌కు వార్డెన్ వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే హాజరవుతున్నారని, మిగతా రోజుల్లో హాస్టల్ నిర్వహణ బాధ్యతలన్నింటినీ వాచ్‌మెన్, ఇతర సిబ్బందికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ లోపంతో హాస్టల్‌లో అనేక అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ హాస్టల్‌లో నిర్దేశిత మెనూను అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెలకు నాలుగు లేదా ఐదు సార్లు మాత్రమే గుడ్లు పెడుతున్నారని, పోషకాహారం పేరుకే పరిమితమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు అందాల్సిన ఆహారం కోతకు గురవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫైన్ల భారం… విద్యార్థులపై మానసిక ఒత్తిడి
హాస్టల్ వార్డెన్‌తో పాటు సంబంధిత హెడ్‌మాస్టర్ విద్యను వ్యాపారంగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల వద్ద వివిధ కారణాలు చూపిస్తూ ఫైన్లు వసూలు చేసే బాధ్యతను ఓ ఉపాధ్యాయుడు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నాడని సమాచారం. ఈ పరిస్థితుల కారణంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనలతో భయపడిన పలువురు తమ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకెళ్లి టీసీలు రిటర్న్ చేసుకున్నారని తెలుస్తోంది. ఫలితంగా హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని సమాచారం. ఇన్ని ఆరోపణలు, సమస్యలు ఉన్నప్పటికీ హాస్టల్‌కు సంబంధిత హెడ్‌మాస్టర్ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పిల్లల భద్రత, సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


