కాకతీయ ఎఫెక్ట్… టాస్క్‌ఫోర్స్ దూకుడు!
అక్రమ ఫైనాన్స్ ముఠాపై చర్యలు
అధిక వడ్డీల వసూళ్లపై అరెస్టులు
ప్రామిసరీ నోట్లు, కీలక ఆధారాల స్వాధీనం
నిందితుల్ని పోలీసులకు అప్పగింపు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కాకతీయలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అధిక వడ్డీలతో అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న వ్యక్తులపై బుధవారం దాడులు నిర్వహించి కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఫైనాన్స్ కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని ఖానాపురం హవేలీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. దానవాయిగూడెం గ్రామానికి చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు సారధి నగర్‌కు చెందిన శివకుమార్, బానోత్ దీపా కుమారి అనే వ్యక్తులు చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలతో గిరిగిరి ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి అక్రమ ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రామిసరీ నోట్లు, ఇతర కీలక వస్తువులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈ కేసులో పరారీలో ఉన్న మరో వ్యక్తిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవసరమైన సమాచారం సేకరించి ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

సిగరెట్ల దందాకు చెక్.. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో భారీగా పట్టివేత
రెండు ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు
రూ.2.33 లక్షల విలువైన సిగరెట్లు సీజ్
ఇద్దరు నిందితులు అదుపులోకి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత సిగరెట్లను విక్రయిస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కిరాణా షాపులో అనుమతి లేకుండా నిషేధిత సిగరెట్లు విక్రయిస్తున్న కె. సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.84,700గా అధికారులు అంచనా వేశారు.
త్రీటౌన్ పరిధిలో భారీ నిల్వలు
శ్రీనివాస్ నగర్ ఎస్ఎస్వి టవర్స్ సమీపంలో మరో దాడిలో శ్రీరామ్ రమేష్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి అనుమతి లేని నిషేధిత సిగరెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2,33,000గా అంచనా వేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు.


