క్రీడాస్ఫూర్తే అసలైన విజయం!
కబడ్డీ మన సంప్రదాయ క్రీడ
క్రీడలు–యువజన సేవల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి
గెలుపు–ఓటములు సహజమే : మంత్రి సీతక్క
ఘనంగా అండర్–17 జాతీయ కబడ్డీ పోటీలు ఆరంభం
గిరిజన ప్రాంతంలో చరిత్ర సృష్టించిన ఏడూళ్ల బయ్యారం
దేశవ్యాప్తంగా మారుమోగనున్న గ్రామ పేరు
కాకతీయ, కొత్తగూడెం : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమేనని… క్రీడాస్ఫూర్తే ముఖ్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు–యువజన సేవల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో బుధవారం 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ ఈ క్రీడా సంభరం చూస్తే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లు ఉందని అన్నారు. కబడ్డీ మన దేశంలో పుట్టిన సంప్రదాయ క్రీడ అని, మన మట్టిలో పుట్టిన ఆటలు మన సంస్కృతి సువాసనను ప్రపంచానికి చాటుతాయని పేర్కొన్నారు. చెమటతో, శ్రమతో ఆడే ఈ ఆటలో గెలుపు–ఓటములు సహజమని ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మారుమూల గిరిజన ప్రాంతమైన ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ పోటీలతో బయ్యారం గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని తెలిపారు. వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత్–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా “గెలుపు–ఓటములకన్నా మనసులు గెలుచుకుని రావాలి” అన్న సందేశాన్ని గుర్తు చేస్తూ… బయ్యారానికి వచ్చిన క్రీడాకారులు కూడా ఇక్కడి ప్రజల మనసులు గెలుచుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు.

గెలుపు–ఓటములే జీవిత పాఠాలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ… గెలుపులో ఆనందాన్ని, ఓటమిలో పాఠాలను జీవితానికి మార్గదర్శకంగా మలచుకోవాలని సూచించారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ బాధ్యత తీసుకున్న కంది చారిటబుల్ ట్రస్ట్, సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆరు నెలల పాటు శ్రమించి ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… గ్రామీణ స్థాయిలో యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ తరహా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించామని, అదే విధంగా జాతీయస్థాయి పోటీలను కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులకు ఈ పోటీలు మరచిపోలేని అనుభవంగా నిలుస్తాయని, జిల్లా ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటిడిఏ పీఓ రాహుల్, విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ నిర్మల్ జంగ్డే, సర్పంచ్ చందర్రావు, కంది చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారెడ్డి, విశ్వభరత్ రెడ్డి, తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, క్రీడా–విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


