సీఎంతో ఖమ్మం కార్పోరేటర్ల భేటీ
బీఆర్ ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కార్పోరేటర్లు
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో చేరికలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే తాము కాంగ్రెస్‌లో చేరినట్లు వారు వెల్లడించారు. ఇటీవల బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు సీహెచ్ లక్ష్మీ, జి. చంద్రకళ, డి. సరస్వతి, అమృతమ్మ, ఎం. శ్రావణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర అభివృద్ధి, ప్రజాసమస్యలపై సీఎంతో చర్చించారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ శ్రేణులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


