సీతారామ డిస్ట్రిబ్యూటరీ భూసేకరణకు వేగం
ప్రాధాన్యతలో భూసేకరణ పూర్తి చేయాలి
ప్యాకేజీ–2 పనులపై అధికారులతో సమీక్ష
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆ దిశగా డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
ప్యాకేజీ–2 వివరాలు
సీతారామ ప్యాకేజీ–2 కింద 12ఎల్–ఆర్‌ఎం1 మైనర్ కాల్వ ద్వారా కల్లూరు, పెనుబల్లి మండలాల్లో మొత్తం 12,454 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఇందుకు అవసరమైన భూసేకరణలో భాగంగా పెనుబల్లి మండలంలో ఎస్‌డీఆర్ ప్రక్రియను ఫిబ్రవరి 3, 2026 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లూరు మండలంలో ఎంజాయ్‌మెంట్ సర్వేను వేగవంతంగా పూర్తి చేసి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గ్రామాల వారీగా సర్వే పురోగతిని సమీక్షించిన అదనపు కలెక్టర్, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు సంబంధించి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం 45 రోజుల గడువు ముగిసిన తర్వాత గ్రామ సభలు నిర్వహించి, చట్ట ప్రకారం అవార్డు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాసులు, సర్వేయర్లు, సంబంధిత మండల తహసిల్దార్లు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


