జనవరి 9న జాబ్‌మేళా
అపోలో ఫార్మసీలో 100 ఉద్యోగాలు
ఖమ్మంలో మోడల్ కెరీర్ సెంటర్‌లో నిర్వహణ
జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ వెల్లడి
కాకతీయ, రఘునాథపాలెం : ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ–యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఈనెల 9వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీ సంస్థలో దాదాపు 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఐటీఐ టేకులపల్లిలో ఉన్న మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఫార్మసిస్ట్ పోస్టులకు అర్హతలు
హైదరాబాద్‌లో పనిచేసే విధంగా అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్‌గా పని చేయడానికి 19 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగి డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ (పీసీఐ గుర్తింపు) ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఫార్మసిస్ట్ అసిస్టెంట్, అప్రెంటిస్‌షిప్ పోస్టులకు 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో పాటు మెడికల్ స్టోర్‌లో పని చేసిన అనుభవం ఉన్న 19–30 ఏళ్ల యువకులు అర్హులని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు వేతనం చెల్లించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి స్పష్టం చేశారు. జాబ్‌మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ–యువకులు తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


