కదం తొక్కుతూ కదలి రండి!
సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు తరలిరావాలి
జనవరి 18న భారీ బహిరంగ సభ
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి
కాకతీయ, ఖమ్మం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలో ప్రచారం హోరెత్తింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వందేళ్లుగా సీపీఐ పనిచేస్తోందని, అధికార యావ లేకుండా ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీనేనని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు వేలాది మంది కదం తొక్కుతూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం నగరంలో నిర్వహించిన జీపుజాతాలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్, గ్రెయిన్ మార్కెట్, పాత బస్టాండ్, ముస్తఫానగర్, రోటరీ నగర్, రామన్నపేట, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో సీపీఐ నేతలు ప్రసంగిస్తూ శతాబ్ది ఉత్సవాల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా జమ్ముల జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం జరిగిన ఆ మహోద్యమం తెలంగాణ ప్రజల జీవితాల్లో చైతన్యాన్ని నింపిందని చెప్పారు. భూ సంస్కరణల చట్టం, దున్నేవాడికే భూమి నినాదం, బ్యాంకుల జాతీయకరణ, జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటి అనేక విజయాలు కమ్యూనిస్టు ఉద్యమం సాధించిందని జితేందర్‌రెడ్డి గుర్తుచేశారు. 2024 డిసెంబర్ 26 నుంచి దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని, వాటి ముగింపు సభ ఖమ్మంలో జరగడం గర్వకారణమన్నారు. ఖమ్మం నగరం ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని, దశాబ్దాలుగా వామపక్ష పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారని సీపీఐ నేతలు పేర్కొన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జనవరి 18న జరిగే శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని నగర ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, రాష్ట్ర సమితి సభ్యులు ఎస్.కె.జానిమియా, మహ్మద్ సలాం, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, సిహెచ్.సీతామహలక్ష్మి, పగడాల మల్లేష్, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆరెంపుల సతీష్, పల్లెసుద్దుల శ్రీను, మనోజ్, చందర్రావు, శ్రీకాంత్, శాంతి, మృతేష్ తదితర కళాకారులు పాల్గొన్నారు.


