గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల కీలకపాత్ర
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు కీలకపాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, తమ విధుల్లో పారదర్శకత పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు జి. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


