సామాజిక సేవలతోనే సమాజంలో గుర్తింపు
కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్
కాకతీయ, కొత్తగూడెం : సామాజిక సేవల ద్వారానే సమాజంలో శాశ్వత గుర్తింపు లభిస్తుందని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయంలో సమాచార హక్కు సంరక్షణ చట్టం–2005 ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సమాచార హక్కు సంరక్షణ చట్టం ఆధ్వర్యంలో ప్రజల కోసం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి అభిమానం పొందాలని అన్నారు. ప్రభుత్వ పనుల్లో పారదర్శకత తీసుకురావడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సామాన్య ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజర్ మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేయాలని అన్నారు. సమాచార హక్కు సంరక్షణ చట్టం–2005 నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం అందేలా అధికారులు బాధ్యత వహించాలని కోరారు. పారదర్శక పాలన లక్ష్యంగా తమ కమిటీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి రాజ్ గౌడ్, ఎస్.కే. పాషా, చింతల చెరువు గీరోషం, గోపాల్ రావుతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, సమాచార హక్కు సంరక్షణ చట్టం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


